*ఎముక విరగనివ్వకండి!*
చిన్న వయసులో ఎముక విరిగితే... కట్టు వేస్తాం. త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాం. అదే ఎముక మలివయసులో విరిగితే... కట్టువేసినా... జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే... అది ఆస్టియోపోరోసిస్ కావొచ్చు కాబట్టి. అసలా సమస్య ఎందుకు వస్తుంది... దానికి పరిష్కారాలేంటో చూద్దామా!
ఆస్టియోపోరోసిస్ అనేది మెటబాలిక్ డిజార్డర్. అది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా ఎముకలు ఏర్పడటం గురించి అవగాహన ఉండాలి. ఎముకలు అంతర్గత శరీర భాగాలకు రక్షణగా నిలుస్తాయి. కొలాజిన్ ఫైబర్స్, మినరల్స్, క్యాల్షియంతో ఇవి ఏర్పడతాయి. మన శరీరంలో ఎముకలు నిరంతరం తయారవుతూనే ఉంటాయి.
(ఆస్టియో బ్లాస్టిక్ యాక్టివిటీ అంటారు). అలా ఏర్పడిన ఎముకలు.. ఒత్తిడి పెరిగే కొద్దీ క్షీణిస్తుంటాయి(ఆస్టియో క్లాస్టిక్ యాక్టివిటీ అంటారు). ఎప్పుడయితే ఎముకలు ఏర్పడటం తగ్గి.. క్షీణించే వేగం పెరుగుతుందో అప్పుడు ఆస్టియోపోరోసిస్ ఎదురవుతుంది. అలాగే... కొలాజిన్ ఫైబర్స్ తగ్గినా, క్యాల్షియం నిల్వ తక్కువగా ఉన్నా ఈ సమస్య తలెత్తుతుంది.
వయసును బట్టి... ఆస్టియో పోరోసిస్ సాధారణంగా రెండురకాల్లో కనిపిస్తుంది. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్: ఇది సహజంగా ఉండే సమస్య. పురుషులతో పోలిస్తే... మహిళల్లో చిన్న, పల్చని ఎముకలు ఉంటాయి. అయితే స్త్రీలల్లో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోను ఎముకలకు అండగా ఉంటుంది. అందుకే ముప్ఫైఏళ్ల వరకూ మహిళలకు ఎముకబలం బాగున్నా... అరవైఏళ్లు దాటేసరికి క్రమంగా తగ్గుతుంది. దానికి కారణం మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజెన్ హార్మోను విడుదల దాదాపుగా ఆగిపోవడమే. దాంతో ఎముక ఏర్పడటం చాలావరకూ ఉండదు. ఎముకపై ఏ కాస్త ఒత్తిడి పడినా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. సెకెండరీ ఆస్టియోపోరోసిస్: కొన్ని రకాల వ్యాధుల వల్ల ఇది ఎదురవుతుంది. క్యాల్షియం, విటమిన్ డి లోపం ఉన్నవారిలో సెకెండరీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు ఉన్నవారిలోనూ ఈ సమస్య రావొచ్చు. దీర్ఘకాలం పాటు ఉత్ప్రేరకాలు తీసుకునేవారిలో... ధూమపానం, మద్యపానం చేసేవారిలోనూ ఇది కనిపిస్తుంది. హైపోగొనాడిజంతో బాధపడుతున్నప్పుడూ ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రం నుంచి క్యాల్షియం ఎక్కువగా వెళ్లిపోతున్నప్పుడు, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా శరీరం క్యాల్షియం స్వీకరించదు. అలానే హైపర్ పారా థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా సెకెండరీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలను బట్టే... మనం పెద్దగా గమనించం కానీ... ఒళ్లంతా నొప్పులుంటాయి. ఆకృతి కూడా వంగిపోయినట్లు ఉంటుంది. ఇక, ఏ మాత్రం తట్టుకుని పడిపోయినా ఫ్రాక్చర్ అవుతుంది. ముఖ్యంగా మణికట్టు, మోకాలు, తుంటి భాగాలపై ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితి ఎక్కువ. ఒక వయసు వచ్చాక ఎముక క్షీణత లక్షణాలు కనిపిస్తే... ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ప్రాథమిక పరీక్షలతోపాటు డెక్సా స్కాన్ చేస్తారు. అందులోని టీ స్కోర్‌ని బట్టి ఆస్టియోపోరోసిస్‌కు దగ్గరగా ఉన్నారా లేక, సమస్య బారిన ఇప్పటికే పడ్డారా అన్నది తెలుసుకుంటారు. ఆ సూచికలో -1 నుంచి -2.5 వరకూ ఉంటే దాన్ని ఆస్టిపీనియా అంటారు.-2.5 కన్నా తక్కువగా ఉంటే తీవ్రమైన ఆస్టియోపోరోసిస్‌గా పరిగణిస్తారు. ఏదయినా తట్టుకుని కిందపడినా ఫ్రాక్చర్ అవుతుంది. ఎముక ఆరోగ్యాన్ని కూడా అంచనా వేస్తారు. పరిస్థితిని బట్టి మెటబాలిక్ ప్రొఫైల్స్, క్యాల్షియం, విటమిన్ డి స్థాయుల్ని తెలుసుకునేందుకు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. వీటన్నింటిని బట్టే చికిత్స సూచిస్తారు.
*పోషకాలూ అవసరమే...*
ఆస్టియోపోరోసిస్ ప్రారంభదశలో ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు.
* ఆహారంలో ఆకుకూరలు, బాదం, వాల్‌నట్లు, పల్లీలు, పాలు, పాల పదార్థాలు, గుడ్డు పచ్చసొన ఉండేలా చూసుకోవాలి. సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యాయామం జీవితంలో భాగం కావాలి. నడక, పరుగు, ఈత... ఇలా ఏవయినా ఎంచుకోవచ్చు. వీటితోపాటు బరువులు ఎత్తే వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది.
* కొందరు అమ్మాయిలు ఎక్కువ వ్యాయామం చేసి బాగా సన్నగా మారతారు. అది కూడా భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్‌కి దారితీయొచ్చు. కాబట్టి అతిగా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే అధికబరువును అదుపులో ఉంచుకోవాలి. పాలు కచ్చితంగా తాగాలి.
* రోజూ ఎండలో కాసేపు గడపాలి. ఆహారం ద్వారా క్యాల్షియం సరిపోకపోతే... వైద్యులు అదనంగా కాల్షియం సప్లిమెంట్లను సూచిస్తారు. రోజూ 1000 మిల్లీగ్రాములు వరకూ క్యాల్షియం, 60 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి తీసుకోవాల్సి ఉంటుంది. యాభైఏళ్లు దాటిన తరువాత 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది.
* సమస్య ఉన్నట్లయితే... తీవ్రతను బట్టి యాంటీరిసార్టివ్ డ్రగ్‌ని సూచిస్తారు. వాటిలో బిస్‌ఫాస్ఫోనేట్ తరగతికి చెందిన మందులు, అలెన్‌డ్రోనేట్ రైజ్డ్రోనేట్, ఇబాన్‌డ్రోనేట్, జొలెన్‌డ్రోనికాసిడ్ వంటివి ఉంటాయి. అలాగే డెనొసుమాబ్ వంటి ఆర్‌ఏఎన్‌కేఎల్ ఇన్హిబిటర్లు కూడా వాడమంటారు. ఈస్ట్రోజెన్, కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్, పారాథైరాయిడ్ హార్మోన్ ఎనలాగ్స్ సూచిస్తారు. విటమిన్ డి లోపం ఉంటే గనుక ఆ పోషకం అందేలా చూసుకోవాలి. లేదంటే ఎముకలకు క్యాల్షియం అందదు. కాబట్టి ఆ పోషకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది గమనించుకోవాలి.
అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లేమి వంటివీ ఆస్టియోపోరోసిస్ రావడానికి కారణాలే.
0 Comments